పెళ్ళై.., ఆరు నెలల తర్వాత పుట్టింటికొచ్చిన నన్ను చూసి మా అమ్మ తెగ సంతోషపడిపోతోంది.! ఆ సంతోషంతోనే నన్ను గుండెలకు హత్తుకుంటూ… “చాలా లావయ్యావు … ముఖం కూడా వెలిగిపోతోంది…అంటే అల్లుడు నిన్ను రాణిలాగా చూసుకుంటున్నాడన్నమాట”.! అనింది. ఆమె సంతోషాన్ని చెడగొట్టడం ఇష్టంలేని నేను అవునూ అనట్టు తలూపాను.! ఎలా చెప్పగలను… పెళ్లి చేసుకొని తీసుకెళ్లిన మూడో రోజే.. నా భర్త నన్ను 50 వేలకు బ్రోతల్ హౌస్ లో అమ్మేశాడని..? ఎలా చెప్పగలను…నన్ను చూసుకోడానికి ఇప్పుడు ఒక్క అల్లుడు కాదు…చాలామంది అల్లుళ్లు ఉన్నారని?
తిరిగి ఇంటికెళ్లి…బతకడమే కష్టమైన నా తల్లికి భారం అవ్వాలనుకోలేదు.! ఆ వేశ్యాగృహంలో నా ఉద్యోగం ఏంటో అర్థం చేసుకోడానికి నాకు వారం పట్టింది. అప్పటి నుండి ఈ నరకాన్ని మౌనంగా భరించడం అలవాటు చేసుకున్నాను. కాల్చిన సిగరెట్ నా ఒంటిమీద చేసిన గుర్తులకు, నా దేహాంలోకి దిగిన పంటి గాట్లకు, రక్తమోడుతున్న నా ఆడతనానికి తెలుసు… నా ఆర్తనాదాలు.! నా నిద్రలేని రాత్రులు.!!
అలా సంపాధించిన డబ్బును అమ్మకిచ్చాను. అల్లుడిచ్చాడా..? అంతులేని నమ్మకంతో అడిగింది అమ్మ.! ఆ… అవును…అల్లుళ్లు… (బహువచనం) అని నాలో నేను అనుకున్నాను. నా పాపిస్టి జీవితం గురించి చెప్పడం ఇష్టంలేక.!!
ఆమ్మ వండింది తినడం, ఆమె ఒడిలో నిద్రపోవడం…. ఇలా రెండు రోజులు అమ్మతో హ్యాపీగా గడిపాను.! నేను వెళ్లాల్సిన టైమ్ అయ్యిందని బయలు దేరుతున్న నా చేతిలో పిండి వంటలు పెట్టి…. “నీ భర్తకు తినిపించమ్మా”…అంది అమ్మ..!! హా తినిపిస్తాను..ఈ రోజు రాత్రి నా దగ్గరకొచ్చే భర్తలందరికీ…. అంటూ నాలో నేను గొనుక్కుంటూనే బయలు దేరాను.!!
దేవుడు సెక్స్ వర్కర్స్ ప్రార్ధనలు వింటాడో లేదో తెలియదు. కానీ వింటే…నా తల్లి సంతోషంగా ఉంటే చాలని కోరుకుంటా…నా గురించి కోరుకోడానికి ఇక మిగిలింది ఏమి లేదు కదా.!
courtesy: Logical Telugu